కొవాగ్జిన్ డీల్ లో అవకతవకలు.. బ్రెజిల్ అధ్యక్షుడిపై కేసు

కొవాగ్జిన్ డీల్ లో అవకతవకలు.. బ్రెజిల్ అధ్యక్షుడిపై కేసు

సాప్ పాలో: భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్.. కోవాగ్జిన్ కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై బ్రెజిల్ అధ్యక్షుడికి సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. దేశ అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ జరపాలంటూ ఆదేశాలిచ్చింది. వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కోబోతున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్సనారోకు సుప్రీంకోర్టు నిర్ణయం గట్టి ఎదురుదెబ్బే.
భారత్ కు చెందిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డీల్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ఉన్నత ప్రాసిక్యూటర్‌ కార్యాలయానికి సుప్రీంకోర్టు జస్టిస్‌ రోసా వెబర్‌ అధికారం ఇచ్చారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ కొనుగోలు కోసం బ్రెజిల్‌ మధ్యవర్తి ద్వారా  300 మిలియన్‌ డాలర్లు విలువ చేసే 20 మిలియన్‌ డోసుల ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో డోసును 15 డాలర్ల చొప్పును కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో బొల్సనారో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.  ఈ ఆరోపణలపై బ్రెజిలియన్‌ సెనేట్‌ కమిషనర్‌ దర్యాప్తు చేస్తోంది.

తాజాగా అధ్యక్ష కార్యాలయ పాత్రపై ప్రత్యేక దృష్టిసారించి దర్యాప్తు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. బ్రెజిలియన్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్స్‌, కంప్ట్రోలర్‌ జనరల్‌ ఆఫీస్‌ వేర్వేరుగా విచారణ చేపట్టనున్నాయి. ఈ కేసులో కాంగ్రెస్‌ దిగువ సభ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ రికార్డో బారోస్‌ ప్రమేయం ఉన్నట్లు చట్టసభ్యులు చెబుతున్నారు. అయితే తాము ఎటువంటి తప్పు చేయలేదని బొల్సనారో, బారోస్‌ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము బ్రెజిల్‌ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే ప్రకటించింది. పిటీషన్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని, మొత్తం విచారణ 90 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.